(news in sakshi )
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన 'పీకే' హిందీ సినిమా కథ తన నవల నుంచి కాపీ కొట్టిందేనంటూ ఓ రచయిత పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత, దర్శకులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. తన హిందీ నవల 'ఫరిస్తా'లోని పాత్రలు, సన్నివేశాలను పీకే సినిమాలో వాడుకుని భావచౌర్యానికి పాల్పడ్డారని కపిల్ ఇసాపురి అనే రచయిత కోర్టుకు తెలిపారు. తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు. తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపు ఇవ్వడంతో పాటు కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని వివరించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం పీకే సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత అభిజత్ జోషీలకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న తన ముందు హాజరై పిటిషనర్ ఆరోపణలపై స్పందించాలని న్యాయమూర్తి నజ్మీ వజీరి నోటీసుల్లో ఆదేశించారు.
ఇదిలా ఉండగా, సినిమా విడుదలై ఇంతకాలమైన తరువాత ఈ పిటిషన్ దాఖలు చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.