చెన్నై : రాంచరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రభుదేవా సిద్దం అవుతున్నారట. ఆ సినిమాను ప్రభుదేవా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడంతో అది చూసినప్పటినుంచి దాన్ని ఎలాగైనా హిందీలో తీయాల్సిందేనని ప్రభుదేవా అంటున్నాడు. యాక్షన్ జాక్సన్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో.. ఆ తర్వాత ఏదైనా విభిన్నమైన సినిమా తీయాలని అనుకుంటుండగా... కృష్ణవంశీ కళాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆయన దృష్టికి వచ్చింది. హిందీ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఉంటారని సమాచారం. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన చూసి ప్రభుదేవా చాలా ఇంప్రెస్ అయ్యారని, దాంతో ఆయన తప్ప వేరేవెరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరనిపించి ఆయన్నే ఖాయం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రభుదేవా ఈ సినిమాను ప్రత్యేక స్క్రీనింగ్ లో చూసిన విషయాన్ని సినిమా నిర్మాత బండ్ల గణేశ్ కూడా నిర్ధారించినా, రీమేక్ విషయం గురించి మాత్రం ఆయనేమీ చెప్పలేదు. ప్రస్తుతానికి తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనన్నారు. ఇంతకుముందు పోకిరీని వాంటెడ్ గాను, విక్రమార్కుడిని రౌడీ రాథోడ్ గాను తీసి బాలీవుడ్ లో ప్రభుదేవా కొన్ని విజయాలు చూశారు. దాంతో ఇప్పుడాయన గోవిందుడు సినిమాను రీమేక్ చేయడం పెద్ద విచిత్రమేమీ కాదని సినీ పండితులు అంటున్నారు.