(Sakshi | Updated: January 17, 2015 00:08 (IST))
ప్రపంచకప్ మరో 28 రోజుల్లో
మెల్‌బోర్న్: వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకే భారత జట్టు ఆస్ట్రేలియాకు వచ్చిందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెప్పాడు. ‘2011నాటి ప్రదర్శన పునరావృతం చేయగలమనే ధీమాతో ఉన్నాం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మా ఆటతీరును మార్చుకుంటాం. గత రెండేళ్లుగా మా జట్టు చాలా నిలకడగా ఆడుతోంది. మార్చి 29న మెల్‌బోర్న్ మైదానంలో ఫైనల్ ఆడేందుకే మేం ఆస్ట్రేలియా వచ్చాం’ అని ధోని ధీమాగా చెప్పాడు. ముక్కోణపు వన్డే టోర్నీలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు కొత్త డ్రెస్‌తో బరిలోకి దిగనుంది.
ఈ డ్రెస్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధోని మాట్లాడాడు. అయితే టెస్టుల నుంచి ఆకస్మిక నిర్ణయంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. ‘ఏ క్రీడలో అయినా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప విషయం. దేశంలో క్రికెట్‌లో పోటీ ఎక్కువ. ఈ క్రీడలో భారత జట్టు జెర్సీని ధరించడం గొప్ప గౌరవం. ఇది నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ధోని అన్నాడు. టెస్టుల నుంచి తప్పుకోవడం వల్ల తనకు అదనంగా విశ్రాంతి దొరికిందని, దీనివల్ల తాజాగా బరిలోకి దిగుతున్నానని తెలిపాడు.
ఏ ఫార్మాట్ అయినా ఒకటే: కోహ్లి
భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఏ ఫార్మాట్‌లో అయినా తాను రాణించాలని కోరుకుంటానని వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పా డు. ‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను బాగా ఆస్వాదించాను. ఇక వన్డే ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెల వడం ఏ క్రికెటర్‌కైనా కల. దానిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఓ జట్టుగా దీనికి సంబంధించిన ప్రణాళిక మా దగ్గర ఉంది’ అని కోహ్లి అన్నాడు. ప్రపంచకప్ గెలుస్తాం
మూడు నాలుగేళ్లుగా భారత జట్టును ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మించుకున్నామని, ప్రస్తుత జట్టుకు టైటిల్ గెలిచే సత్తా ఉందని కోచ్ ఫ్లెచర్ చెప్పారు. ‘వ్యక్తిగతంగా కోచ్‌గా ఇది నాకు మూడో ప్రపంచకప్. ఈ టోర్నీని దృష్టిలో ఉంచుకునే మూడు నాలుగేళ్లుగా మేం జట్టును నిర్మించుకున్నాం. పెద్ద టోర్నీల్లో ఎలా గెలవాలనే అంశం వీరికి తెలుసు. అలాగే ఒత్తిడినీ అధిగమించగలరు. కాబట్టి ఈసారి ప్రపంచకప్ గెలుస్తాం’ అని ఫ్లెచర్ ధీమా వ్యక్తం చేశారు.
గత మూడేళ్లలో జరిగిన మూడు ఐసీసీ టోర్నీ (రెండు టి20 ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ) లలో భారత్ కేవలం రెండే మ్యాచ్‌లు ఓడిపోయిందని ఫ్లెచర్ గుర్తు చేశారు. ‘ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీలో అయినా ఒత్తిడి ఒకేలా ఉంటుంది. గత మూడేళ్లుగా పెద్ద టోర్నీల్లో ఆడిన అనుభవం వీరికి ఉపకరిస్తుంది. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఈ జట్టు విజయాలు సాధించింది. అందుకే నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని చెప్పారు. టెస్టు సిరీస్‌లో ఆడటం వల్ల జట్టులోని ఆటగాళ్లకు ఆస్ట్రేలియా పరిస్థితులపై అవగాహన వచ్చిందని తెలిపారు. ప్రపంచకప్‌కు ముందు ముక్కోణపు వన్డే టోర్నీని మంచి సన్నాహకంగా ఉపయోగించుకుంటామని చెప్పారు.
ఒక్కో డ్రెస్ కోసం 33 ప్లాస్టిక్ సీసాలు
భారత జట్టు ముక్కోణపు వన్డే టోర్నీలో కొత్త డ్రెస్‌తో బరిలోకి దిగబోతోంది. జట్టు దుస్తుల భాగస్వామి నైకీ గురువారం మెల్‌బోర్న్‌లో దీనిని విడుదల చేసింది. ఆటగాళ్లు ధరించే జెర్సీ, ట్రాక్ ఒక్కో దాని కోసం 33 ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసి వాడారు. ఈ దుస్తులు చాలా తక్కువ బరువుతో ఉంటాయి. అలాగే బ్యాటింగ్ కోసం, బౌలింగ్ కోసం విడివిడిగా బూట్లు తయారు చేశారు.
ప్రాక్టీస్ మొదలు
టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత క్రికెటర్లు శుక్రవారం తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఫీల్డింగ్, బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. కెప్టెన్ ధోని ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటంతో పాటు పేసర్ల బౌన్సర్లను ఆడటం ప్రాక్టీస్ చేశాడు. ధావన్, రహానే, రోహిత్, కోహ్లి కూడా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కోచ్ ఫ్లెచర్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇషాంత్ శర్మతో స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయించారు. రైనా, రహానేలతో కలిసి ఇషాంత్ స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం.
భారత్‌పై చరిత్ర మారుస్తాం: యూనిస్
కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్ ఎప్పుడూ గెలవలేదు. ఈసారి కూడా ఈ రెండు జట్లు ఫిబ్రవరి 15న తమ తొలి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈసారి భారత్‌పై గెలిచి చరిత్రను తిరగరాస్తామని పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు యూనిస్‌ఖాన్ అన్నాడు. ‘క్రికెట్‌లో అంకెలకు ప్రాధాన్యత ఉండదు. ఆ రోజు బాగా ఆడటం ముఖ్యం. మా జట్టు సమతూకంతో ఉంది. సామర్ధ్యానికి తగ్గట్లుగా రాణిస్తే భారత్‌ను ఓడించగలం. ఈసారి చరిత్రను మారుస్తాం’ అని అన్నాడు.